Suicides : ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆ కుటుంబం రాత్రి భోజనం పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కోడలు సడీసప్పుడు లేకుండా తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. అత్త కీడును శంకించి తన భర్తను అప్రమత్తం చేసింది. దాంతో మామ.. కోడలు గది తలుపుతట్టినా ఫలితం లేకపోవడంతో ఆందోళనతో మొత్తుకున్నాడు. సప్పుడు విన్న ఇరుగుపొరుగు వచ్చి తలుపులు పగులగొట్టగా కోడలు గదిలో ఉరేసుకుని ఉంది. అది చూసిన మామ మరో గదిలోకి వెళ్లి తాను కూడా ఉరేసుకున్నాడు.
నిమిషాల వ్యవధిలోనే మామ, కోడలు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం మౌగంజ్ జిల్లాలోని నాయ్గర్హి పోలీస్‌స్టేషన్ పరిధిలోని భీర్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భీర్ గ్రామానికి చెందిన వెంకట్ యాదవ్ (60) భార్య, కొడుకు, కోడలుతో కలిసి నివాసం ఉంటున్నాడు.
వెంకట్ యాదవ్ కుమారుడు రామ్ గరీబ్‌కు ఇటీవలే వివాహం జరిగింది. పూనమ్ యాదవ్ అనే యువతి ఆ ఇంటి కోడలిగా వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఎప్పటిలాగే కుటుంబంలోని నలుగురూ భోజనం చేశారు. ఆ తర్వాత రామ్ గరీబ్ బయటికి వెళ్లాడు. పూనమ్ యాదవ్ సడెన్‌గా తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. కీడును శంకించిన అత్త తన భర్తను అప్రమత్తం చేసింది. దాంతో ఆందోళనకు గురైన వెంకట్ యాదవ్ కోడలు గది తలుపుతట్టాడు.
అయినా అవతలి నుంచి స్పందన లేకపోవడంతో ఆయన పెద్దగా కేకలు వేశాడు. దాంతో ఆ చప్పుడు విని ఇరుగుపొరుగు వచ్చారు. గది తలుపులు పగులగొట్టారు. లోపల చూడగా పూనమ్ యాదవ్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉంది. దాంతో ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. కాసేపటికే వెంకట్ యాదవ్ మరో గదిలోకి వెళ్లి తాను కూడా ఉరేసుకున్నాడు. నిమిషాల వ్యవధిలో మామా, కోడలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో సంచలనంగా మారింది.
కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మామ, కోడలు ఆత్మహత్యలకు గల కారణాలు దర్యాప్తులో తెలుస్తాయని చెప్పారు.