నవమాసాలు బిడ్డను మోసి తన ప్రాణాలకు తెగించి జన్మనిస్తుంది తల్లి. ఆ తల్లి బాధ తనకు తప్పితే ఇంకెవరికీ తెలియదు. తల్లి బిడ్డకు ప్రాణంపోసి జీవితాంతం తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తండ్రి మాత్రం ఆ బిడ్డకు బాధ్యత వహించి.. బిడ్డ భవిష్యత్తును తన భుజాల మీద వేసుకుంటాడు.
కానీ.. ఈ తండ్రి మాత్రం సొంత కొడుకు ప్రాణాన్నే తీశాడు. చితకబాది చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర, థానె జిల్లాలోని కల్వాలో చోటు చేసుకుంది. సందీప్ ప్రజాపతి(41)కి 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆ బాలుడు తన తండ్రి ప్యాంట్ జేబులో నుంచి 50 రూపాయలు దొంగలించి తీసుకెళ్లాడు.
ఈ విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి సందీప్.. అతడిని చితకబాదాడు. మిగితా పిల్లలు వద్దు అని చెప్పినా వినకుండా.. ఆ బాలుడిని తీవ్రంగా కొట్టడంతో బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. బాలుడి తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో బాలుడు మృతి చెందాడు.
బాలుడు చనిపోయాడని తెలియగానే.. ఇంట్లో డోర్ వేసుకొని ఫ్యామిలీ అంతా.. ఆ బాలుడి బాడీని ఇంట్లోనే దాచి రాత్రి నిద్రపోయారు. ఉదయం.. ఓ మహిళ వచ్చి సందీప్ ఇంటి డోర్ కొట్టింది. ఎంతకూ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే పక్కింటి వాళ్లను అడిగింది.
దీంతో రాత్రి ఆ ఇంట్లో నుంచి బాలుడి అరుపు శబ్దాలు వినిపించాయని పక్కింటి వాళ్లు చెప్పడంతో వెంటనే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా బాలుడు విగతజీవుడై పడిఉన్నాడు. పోలీసులు రావడం చూసి అసలు విషయం చెప్పాడు ప్రజాపతి. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. బాలుడిని అతడు తీవ్రంగా కొట్టి చంపిన సమయంలో బాలుడి తల్లి కూడా ఇంట్లోనే ఉన్నదని పోలీసులు తెలిపారు.