FASTag : ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) విధానంలో ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)’ ఒక కీలకమైన సంస్కరణను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే FASTag యాక్టివేషన్ సమయంలో వాహన వివరాలను ధృవీకరించే పూర్తి బాధ్యతను బ్యాంకులకే అప్పగించింది. ఇప్పటివరకు వాహన యజమానులు అన్ని చెల్లుబాటుఅయ్యే పత్రాలు సమర్పించి ఫాస్ట్‌ట్యాగ్ పొందిన తర్వాత కేవైవీ (Know Your Vehicle) పూర్తి చేసుకోవాల్సి ఉండేది.
దాంతో యాక్టివేషన్ ఆలస్యం కావడం, టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవడం, రిఫండ్స్ నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. కొత్త విధానంతో ఫాస్ట్‌ట్యాగ్ జారీ తర్వాత ప్రత్యేకంగా కేవైవీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకులు ముందుగానే వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరిస్తాయి. ఫలితంగా FASTag జారీ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఇది లక్షల మంది వాహన వినియోగదారులకు మేలు చేస్తుంది.
ఈ కేవైవీ సడలింపు కేవలం కొత్తగా జారీ అయ్యే ఫాస్ట్‌ట్యాగ్‌లకు మాత్రమే కాకుండా.. ఇప్పటికే జారీ చేసిన వాటికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇకపై కేవైవీ తప్పనిసరి కాదు. అయితే ఫాస్ట్‌ట్యాగ్ వినియోగానికి సంబంధించిన మోసాలు జరిగినట్లు అనుమానం తలెత్తితే, కేవైవీ చేసుకోవాల్సి వస్తుంది.