Farooq abdullah | జమ్ముకశ్మీర్‌లో టార్గెటెడ్ కిల్లింగ్స్‌పై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టార్గెటెడ్ కిల్లింగ్స్‌ను నిరోధించడం కేవలం పాకిస్థాన్‌తో చర్చలు జరుపడం ద్వారానే సాధ్యమని అభిప్రాయపడ్డారు. చైనాతో చర్చలు జరిపి లడఖ్ సరిహద్దు సమస్యను పరిష్కరించుకున్నట్లుగానే.. పాకిస్థాన్‌తో కూడా చర్చలు జరపాలన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 కారణంగానే లక్షిత హత్యలు జరిగాయని బీజేపీ ఇప్పటివరకు అంటూ వచ్చిందని, అయితే సెమీ అటానమస్ హోదాను రద్దు చేసి నాలుగేండ్లు గడిచినప్పటికీ ప్రజలు చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ హత్యలు ఆగాలంటే పాకిస్థాన్‌తో చర్చలు జరగాల్సిందే అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలాంటి హత్యలకు ఆర్టికల్ 370 కారణమైతే, అమాయక కశ్మీరీ పండిట్ పురాన్ క్రిషన్ భట్ ఎందుకు హత్యకు గురయ్యారని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ఈ హత్యకు ఏదో కారణం ఉండి ఉంటుందని, బయటి నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున ఆర్టికల్ 370 ఈ హత్యలకు కారణం కాదని చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికడితేనే ఇలాంటి హత్యలు ఆగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దానికి సైనికపరంగానే మార్గం వెతకాలన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఏం సాధిస్తున్నారని ప్రశ్నించిన ఆయన.. వీరి బెట్టుతో అమాయక ప్రజలు చనిపోతున్నారని అన్నారు. లడఖ్ సరిహద్దు సమస్యకు చైనాతో మన ప్రభుత్వం చర్చించిందని, అదేమాదిరిగా పాకిస్థాన్ ప్రభుత్వంతో ఎందుకు చర్చించలేకపోతున్నాం అని ప్రశ్నించారు. చర్చలు కొనసాగనంత వరకు ఇలా హత్యలు కొనసాగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు.