న్యూఢిల్లీ : ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు హర్యానాలోని జింద్ జిల్లాలో భారీ ట్రాక్టర్ పరేడ్ నిర్వహించనున్నారు. మహిళా రైతులు ముందుండి చేపట్టనున్న ఈ పరేడ్‌కు సంబంధించి రైతులు రిహార్సల్స్ నిర్వహించారు. రేపటి ర్యాలీలో 5000 వాహనాల్లో 20,000 మంది రైతులు పాల్గొంటారని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. ట్రాక్టర్లపై రైతు జెండాలతో పాటు జాతీయ జెండాలను ఎగురవేసి వ్యవసాయ పరికరాలు, పనిముట్లను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు.
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆగస్ట్ 15ను రైతులు కిసాన్ మజ్దూర్ ఆజాదీ సంగ్రామ దినంగా పాటిప్తారని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జిల్లా, తాలూకా స్ధాయిలో తిరంగా మార్చ్‌లు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తారు. ఇక ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు సింఘు, టిక్రి, ఘజీపూర్లోనూ తిరంగా మార్చ్‌లను రైతులు చేపడతారని కిసాన్ మోర్చా పేర్కొంది.