చంఢీగఢ్, డిసెంబర్ 1: కేంద్రం వైఖరికి నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల విషయంలో మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి కదం తొక్కడానికి సన్నద్ధమయ్యారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు డిమాండ్లపై రైతులు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించడం లేదు. వారితో చర్చలకు సైతం సుముఖత చూపడం లేదు. దీంతో కేంద్రం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతుల డిమాండ్ల సాధనకు ఈ నెల 6న దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించాలని పంజాబ్‌కు చెందిన రైతు నేత శర్వణ్ సింగ్ పంధేర్ పిలుపునిచ్చారు.
దేశంలోని రైతులందరూ వారివారి నేతలు, సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్రగా ఢిల్లీకి కదిలి రావాలని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని భద్రతా దళాలు ఫిబ్రవరి 13న నిలిపివేయడంతో వారు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరి ప్రాంతాల్లో నిలిచిపోయారని పంధేర్ ఆదివారం మీడియా సమావేశంలో చెప్పారు. శంభు, ఖనౌరిలలో రైతులు 293 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారన్నారు.
రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై శర్వణ్ సింగ్ మండిపడుతూ శంభు నుంచి దేశ రాజధానికి ర్యాలీ నిర్వహించాలని కోరారు. ఈ మేరకు ఆయన ఉద్యమ కార్యాచరణను వివరించారు. తొలుత రైతులందరూ శంభు వద్ద కలిసి గ్రూప్‌లుగా ఏర్పడాలని, మొదటి గ్రూప్ రైతులకు శత్నాం సింగ్ పన్ను, సురీందర్ సింగ్ చౌతాలా, సుర్జిత్ సింగ్ పూల్, బల్జీందర్ సింగ్ నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఈ గ్రూప్ తమకు కావాల్సిన నిత్యావసరాలను తీసుకుని ఢిల్లీ వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లాలన్నారు. రైతులు ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాదయాత్ర కొనసాగిస్తారని, తర్వాత రోడ్డు పక్కన రాత్రుళ్లు గడుపుతారన్నారు. అయితే ఒక్కో గ్రూప్‌లో ఎంతమంది ఉండాలన్న విషయాన్ని తర్వాత తెలియజేస్తామన్నారు. కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు తదితర రాష్ర్టాల రైతులు డిసెంబర్ 6న ఆయా రాష్ర్టాల అసెంబ్లీలకు ప్రదర్శన నిర్వహించాలని రైతు నేత గుర్మినీత్ కోరారు. కాగా, ఖనౌరి సరిహద్దులో ఎస్కేఎం నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ తన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి రైతులతో కేంద్రం ఎలాంటి చర్చలు జరపలేదని పంధేర్ తెలిపారు. తమ నుంచి కేంద్రం దూరంగా పారిపోతున్నదని ఆరోపించారు. కాంట్రాక్ట్ వ్యవసాయం తమకెంతమాత్రం ఆమోద యోగ్యం కాదని, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను తాము కోరుతున్నామన్నారు. ఐదేండ్ల పాటు ధాన్యం, మక్కజొన్న, పత్తి పంటలకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయని కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్‌లు తమకు ఇచ్చిన హామీలను అప్పుడే తిరస్కరించినట్టు ఆయన చెప్పారు.
తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని రైతులు ప్రధానంగా కోరుతున్నారు. రుణ మాఫీ చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని, విద్యుత్ చార్జీలు పెంచరాదని, రైతులపై పెట్టిన పోలీస్ కేసులు ఎత్తివేయాలని, 2021 లఖింపూర్ ఖీరి బాధితులకు న్యాయం చేయాలని, భూ సేకరణ చట్టం 2013ను పునరుద్ధరించాలని, ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.