చండీగఢ్: రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. (Farmers tractor march) తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున కేంద్రానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ట్రాక్టర్లతో రైతులు నిరసన తెలపాలని సంయుక్త కిసాన్ మోర్చా జనవరి 8న పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం పంజాబ్, హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.
కాగా, 2024 ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరిలో రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధరతోపాటు రుణ మాఫీ, రైతులు, కార్మికులకు పెన్షన్లు, 2021లో లఖింపూర్ ఖేరీ హింసా బాధితులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 2020 నుంచి 2021 వరకు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన నిరసనల కంటే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా తాజాగా హెచ్చరించింది.