Karnataka | కలబురగి : వ్యవసాయానికి రాత్రివేళ కరెంటు సరఫరా చేయడంపై కర్ణాటక రైతులు ఆందోళనకు దిగారు. పొలాల్లో తారసపడ్డ మొసలిని విద్యుత్తు కార్యాలయానికి తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తద్వారా తాము ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నామో పాలకులకు, అధికారులకు తెలియజేశారు. ఈ ఘటన కలబురగి జిల్లా అఫ్జల్పుర్ తాలూకాలోని గొబ్బుర్ (బీ) గ్రామంలో గురువారం జరిగింది. గొబ్బుర్ గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్ పూజారి తెల్లవారుజామున భీమా నది సమీపంలోని పొలానికి నీరు పారించేందుకు వెళ్లగా అతనికి మొసలి తారసపడింది.
ఇతర రైతుల సాయంతో దాన్ని తాళ్లతో బంధించి, దగ్గర్లోని గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (జెస్కమ్) కార్యాలయానికి తీసుకెళ్లి ఆందోళన చేశారు. రాత్రిపూట పొలాలకు వెళ్లడం వల్ల తాము పాముకాట్లకు గురవుతున్నామని, మొసళ్లు తమపై దాడి చేస్తున్నాయని, ఉదయం 6 గంటల తర్వాత కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రైతులకు నచ్చజెప్పి మొసలిని అటవీ అధికారులకు అప్పజెప్పారు. వారు దాన్ని కలబురిగిలోని మినీ జూకు తరలించారు.