న్యూఢిల్లీ : సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర) ఆధ్వర్యంలో వివిధ రాష్ర్టాల నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ గురువారం న్యూఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. ఈ ఒప్పందం నుంచి డెయిరీ, ఆహార ఉత్పత్తుల దిగుమతులను మినహాయించాలని వారు డిమాండ్ చేశారు. సుంకాలు లేకుండా అమెరికా ఉత్పత్తులను భారత్లోకి అనుమతించడం దేశీయ ఉత్పత్తులు, రైతుల జీవనాధారానికి ప్రమాదకరంగా మారుతున్నదని రైతు నాయకులు హెచ్చరించారు.
తమ పాత డిమాండ్లపై ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని.. తమ ఆందోళనను నేరుగా ప్రధానికే తెలియాలనుకొంటున్నామని వారు తెలిపారు. భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై బహిరంగ చర్చకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక తేదీని ఖరారు చేయాలని వారు కోరారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతు నాయకులు తమ సమస్యలపై ప్రధాని ఆఫీసులో వినతి పత్రాన్ని సమర్పించారు.