న్యూఢిల్లీ, నవంబర్ 17: రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు మరో భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. చారిత్రాత్మక రైతు పోరాటానికి రెండేండ్లు కావొస్తున్న సందర్భంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా రాష్ర్టాల్లోని రాజ్భవన్లకు మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) గురువారం ఒక ప్రకటన చేసింది. రాజ్‌భవన్ మార్చ్‌లో భాగంగా కేంద్రం తీరును ఎండగడుతూ గవర్నర్ల ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించనున్నట్టు పేర్కొన్నది.
ఈ నిరసనలకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా కదలి రావాలని పిలుపునిచ్చింది. డిసెంబర్ 1 నుంచి 11వ తేదీ మధ్య లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల ఆఫీసులకు కూడా మార్చ్ చేపడతామని తెలిపింది. కేంద్రంపై పోరుకు డిసెంబర్ 8న సమావేశమై నిర్ణయం తీసుకొంటామని వెల్లడించింది. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకొన్న సందర్భంగా ఈ నెల 19(శనివారం)న విజయ దినోత్సవాన్ని జరుపాలని నిర్ణయించినట్టు పేర్కొన్నది.
కేంద్రం ఇచ్చిన హామీలతో గత ఏడాది డిసెంబర్ 9న ఉద్యమాన్ని ఆపేశామని, ఇప్పటికీ మద్దతు ధర, పంట బీమా చెల్లింపులు, విద్యుత్తు బిల్లు ఉపసంహరణ, రైతులపై తప్పుడు కేసుల కొట్టివేత తదితర హామీలు నెరవేర్చలేదని ఎస్కేఎం నేత దర్శన్ పాల్ పేర్కొన్నారు. లఖింపూర్ ఖీరి ఘటనకు బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై కూడా కేంద్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కేంద్రానికి నిరసన సెగ తాకేలా ‘రుణభారం నుంచి విముక్తి – మొత్తం పరిహారం’ నినాదంతో ఉద్యమానికి రైతులు సిద్ధం కావాలన్నారు.