న్యూఢిల్లీ, అక్టోబర్ 9: లఖింపూర్ ఘటనపై రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా ఇద్దరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని యూపీ, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే ఏం చేయాలన్నదానిపై ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. రైతు నేతల డిమాండ్‌తో యూపీ సర్కారు దిగొచ్చింది. శనివారం అర్ధరాత్రి ఆశిష్ మిశ్రాను అరెస్టు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం రైతు సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. పక్కా పథకంతోనే కుట్ర పన్ని రైతులను కారుతో తొక్కించి చంపారని ఆరోపించారు. రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటన ‘జలియన్‌వాలా బాగ్’కు ఏ మాత్రం తక్కువ కాదని అన్నారు. అదొక ఉగ్రదాడిగా అభివర్ణించారు. మంగళవారం(12న) రైతులు లఖింపూర్ రావాలని, రైతు యోధులకు నివాళులు అర్పిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేత యోగేంద్ర పిలుపునిచ్చారు.. అమరులైన రైతుల చితాభస్మంతో షహీద్ కిసాన్ యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో చేస్తామని తెలిపారు. 26న లక్నోలో మహాపంచాయత్ జరుపుతామని వెల్లడించారు. దసరా రోజున ఎస్కేఎం ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మలు దహనం చేస్తామన్నారు. అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తప్పించాలని యోగేంద్ర డిమాండ్ చేశారు.
అది చర్యకు ప్రతిచర్య
లఖింపూర్‌లో ఇద్దరు బీజేపీ కార్యకర్తల మరణానికి కారణమైన వారిని తాను దోషులుగా భావించడం లేదని, రైతులపై కారు వెళ్లిన చర్యకు అది ప్రతి చర్య అని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ 750 మంది రైతులు చనిపోయారని చెప్పారు. ప్రధాని మోదీ పార్లమెంటులో కనీసం ఒక్కసారైనా వారి గురించి ప్రస్తావించలేదని, మోదీకి రైతులంటే పట్టింపు లేదని ఆరోపించారు. మద్దతు ధరలపై కేంద్రం మాటల్లో తప్ప చేతల్లో ఏం చేయడం లేదని విమర్శించారు. లఖింపూర్‌లో రైతులపైకి కారు దూసుకెళ్లడం, తర్వాత రేగిన హింసలో ఎనిమిది మంది చనిపోయారు. ‘రైతులైనా, బీజేపీ కార్యకర్తలైనా చనిపోవడం చాలా బాధాకరం’ అని యోగేంద్ర యాదవ్ అన్నారు.
ఆశిష్ మిశ్రా అరెస్టు
రైతు సంఘాల నేతల హెచ్చరికలతో యూపీ సర్కారు దిగొచ్చింది. ఆశిష్ మిశ్రాను రాత్రి 11 గంటల సమయంలో అరెస్టు చేసింది. అంతకుముందు సిట్ ఆయనను 12 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించింది. అయితే విచారణకు ఆశిష్ సహకరించలేదని అందుకే అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయనను కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు. ఆశిష్ శుక్రవారమే సిట్ ముందు హాజరు కావాల్సి ఉండగా రాలేదు. దీంతో అతడు దేశం విడిచి పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. తన కుమారుడు అమాయకుడని, అనారోగ్యం వల్ల శుక్రవారం సిట్ ముందుకు రాలేకపోయాడని అజయ్ మిశ్రా చెప్పారు.