న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్ 2025-26పై రైతు సంఘాలు పెదవి విరిచాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత, రుణ మాఫీ తదితర దీర్ఘకాలిక డిమాండ్లను కేంద్రం ‘క్రూరంగా’ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజా బడ్జెట్.. రైతు, కార్మిక, పేదల వ్యతిరేకమైనదిగా, కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌గా పేర్కొన్నాయి. ఈనెల 5న కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నట్టు రైతు, కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు ఎస్కేఎం (సంయుక్త కిసాన్ మోర్చా) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇది ప్రజల బడ్జెట్. దీని ద్వారా ప్రజలు జేబుల్లోకి మరింత ధనం వస్తుంది. ఇది పెట్టుబడులను పెంచి వృద్ధికి దారి తీసే శక్తి గుణకం. వికసిత్ భారత్ లక్ష్యాలను నడిపించే యువకుల కోసం ప్రభుత్వం పలు రంగాలను తెరిచింది. ప్రజా బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నా.
– నరేంద్ర మోదీ, ప్రధాని
ఇది పూర్తిగా ఎన్నికల బడ్జెట్. ఇందులో కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వలేదు. గతంలో ప్రకటించిన చాలా కార్యక్రమాలు ప్రారంభించ లేదు. ఇప్పుడు పెట్టిన చాలా పథకాలు సామర్థ్యానికి మించి ఉన్నాయి.
– పీ చిదంబరం, మాజీ ఆర్థిక మంత్రి.
కేంద్ర బడ్జెట్ పూర్తి వివక్షతో ఉంది. తమిళనాడు రాష్ర్టాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రజల ఆశలను వమ్ము చేసింది. హైవేలు, రైల్వే ప్రాజెక్టులు, మెట్రో రైలు సహా అభివృద్ధి పనులకు సంబంధించి ఎన్నో విజ్ఞప్తులను కేంద్రం ముందు ఉంచినా అందులో ఒక్కటి కూడా ప్రకటించ లేదు.
– ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి.
ఇది ప్రజలను మోసగించే బడ్జెట్. దేశమంతా నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌ను పొగడటంలో బిజీగా ఉంది. గత 10 ఏండ్లుగా మధ్యతరగతి వర్గాల నుంచి రూ. 54.18 లక్షల కోట్లను ఆదాయపు పన్నుగా వసూలు చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు కంటి తుడుపుగా మినహాయింపు ప్రకటించింది.
– మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు.