లక్నో: ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్లో రైతులు ఎలుగుబంటి వేష ధారణతో సంచరిస్తున్నారు. పంట పొలాలను కోతుల బారి నుంచి కాపాడుకోగలుగుతున్నామని చెబుతున్నారు. కొంత కాలం క్రితం కోతులు గుంపులుగా వచ్చి, పంటలను ధ్వంసం చేస్తుండటంతో వీరు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కోతుల బెడద నుంచి తప్పించుకోలేకపోయారు. చివరికి కొందరు రైతులు కలిసి, సొమ్మును సేకరించి, ఎలుగుబంటి మాదిరిగా ఉండే దుస్తులను తయారు చేయించారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైతు ఈ దుస్తులను ధరించి, పొలాల చుట్టూ సంచరిస్తున్నారు. ఈ ఆలోచన గొప్ప వరంగా మారిందని, ఎలుగుబంటి దుస్తుల్లో తమను చూసి, కోతులు పారిపోతున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ పంటలు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు.