న్యూఢిల్లీ, మార్చి 25: ఈ ఏడాది పంట దిగుబడి బాగా వచ్చింది. ధర బాగానే గిట్టుబాటవుతుందని ఆశించిన ఉల్లి రైతులకు కేంద్రం విధించిన సుంకాల ఘాటు శరాఘాతంలా తగలడంతో కన్నీళ్లు తెప్పించింది. కేంద్రం విధించిన అధిక ఎగుమతి సుంకం కారణంగా తమ పంటను విదేశాలకు ఎగుమతి చేయలేక ఉసూరుమంటున్నారు. దీంతో మోదీ ప్రభుత్వంపై వారు తీవ్ర ఆగ్రహంతో గత నెల రోజులుగా తీవ్ర ఆందోళన చేపట్టారు. దీంతో దిగివచ్చిన కేంద్రం ఎట్టకేలకు వచ్చే నెల నుంచి సుంకాన్ని ఎత్తివేసేందుకు అంగీకరించింది. సాధారణంగా మన దేశం ఉల్లిగడ్డలను ఎక్కువగా చైనా, పాకిస్థాన్‌లకు ఎగుమతి చేస్తారు. అయితే ఈ ఎగుమతి సుంకం కారణంగా ఉల్లిని మన రైతులు అనుకున్నంత ఎక్కువ ఎగుమతి చేయలేక పోయారు.
ఉల్లిపై ఎగుమతుల సుంకంపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తంమైంది. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన రైతులు గిట్టుబాటు ధర లభించక విలవిల్లాడారు. ఈసారి పంట పుష్కలంగా లభించినా ఎగుమతి ఆంక్షల కారణంగా ధర రాక నష్టపోతున్నామని, ఎగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 20 శాతం సుంకం ఎత్తివేయాలని ఉత్లి రైతులు గత నెల రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉల్లి ఎగుమతులు 17.17 లక్షల టన్నులు ఉండగా, 24-25 మార్చి వరకు అది కేవలం 11.65 లక్షల టన్నులు మాత్రమే ఉందన్నా రు. సుడాన్, టర్కీ, పాకిస్థాన్, ఇరాన్, ఈజిప్ట్, హాలెండ్ దేశాలు మన మార్కెట్లలో చొరబడ్డాయని మహారాష్ట్ర ఆనియన్ గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ డిగోల్ పేర్కొన్నారు.దీంతో కేంద్ర ప్రభుత్వం20 శాతం ఎగుమతి సుంకాన్ని ఏప్రిల్ 1 నుంచి తొలగిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది.