చండీఘడ్: శంభూ, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిభిరాలను పంజాబ్ రాష్ట్ర పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రైతు సంఘాలు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంఘాలు .. దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నాయి. డిప్యూటీ కమీషనర్ల కార్యాలయాల వద్ద ధర్నా చేపడుతున్నారు. పంజాబ్‌లో కొందరు రైతులు రాష్ట్రవ్యాప్తంగా చెక్కా జామ్‌కు పిలుపు ఇచ్చారు. రైతు నేతలు జగ్జీత్ సింగ్ దలేవాల్, సర్వన్ సింగ్ పందేర్‌తో పాటు ఇతరుల అరెస్టును రైతు సంఘాలు ఖండించాయి.
పంజాబ్‌లో తమ గ్రామాలకు సమీపంగా ఉన్న రోడ్లను రైతులు బ్లాక్ చేస్తున్నారు. అనేక మంది రైతు నేతల్ని రాష్ట్రవ్యాప్తంగా హౌజ్ అరెస్టు చేశారు. రైతుల అరెస్టును ఖండిస్తూ పార్లమెంట్లో ఇవాళ పంజాబీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ రాజా, గుర్జిత్ ఔజ్లా, అమర్ సింగ్ డిమాండ్ చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న రైతులు నిరాహార దీక్ష ప్రారంభించారు. సంగ్రూర్, పాటియాలాలో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు.జలంధర్ కంటోన్మెంట్‌కు దలేవాల్‌ను తీసుకెళ్లారు. పంజాబీ వైపు నుంచి శంభూ బోర్డర్‌ను క్లియర్ చేశారు.చండీఘడ్ హైవేపై ధర్నా చేస్తున్న రైతుల్ని పోలీసులు చెదరగొట్టారు.
గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు ఖనౌరీ, శంభూ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు. రైతులను అక్కడ నుంచి తరిమివేసిన పోలీసులు ఆ గుడారాలను కూల్చివేశారు. శంభూ, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్దకు వెళుతున్న రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాల్, సర్వన్ సింగ్ పంధేర్తోసహా 200 మంది రైతులను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొహాలీ వద్ద దల్లేవాల్, పంధేర్‌ను అదుపులోకి తీసుకోగా ఖనౌరీ సరిహద్దు వద్ద మరో 200 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండు సరిహద్దు పాయింట్ల వద్ద భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. అంబులెన్సులు, బస్సులు, అగ్నిమాపక శకటాలను అక్కడ నిలిపారు. ఖనౌరీ సరిహద్దు వద్ద దాదాపు 3000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. శంభూ సరిహద్దు వద్దకు మరో పోలీసు బలగాన్ని పంపించారు. రైతులు తమ టెంట్లను ఖాళీ చేసేందుకు పోలీసులు వారికి 10 నిమిషాల వ్యవధి ఇచ్చారు.