RG Kar Incident : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన విషయంలో రైతు నేత రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్కతా ఘటన ఆసరాగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సారధ్యంలోని టీఎంసీ సర్కార్ను లక్ష్యంగా చేసుకునే కుట్రకు తెరలేపారని ఆరోపించారు.
దేశంలో పలు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు జరిగినా విపక్ష సర్కార్ ఉన్నందున బెంగాల్లో ఘటనను హైలైట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నా ఈ ఒక్క ఘటననే హైలైట్ చేస్తున్నారని, గత కొద్దిరోజులుగా ఇదే వార్తను టీవీ చానెళ్లలో పదేపదే చూపుతున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష ప్రభుత్వం ఉన్నందునే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
విపక్ష నేతలను జైళ్లలో మగ్గేలా చేస్తున్నారని, ఆ నేతలే బీజేపీలో చేరితే పునీతులవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక రాకేష్ తికాయత్ వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా విరుచుకుపడ్డారు. తికాయత్ ప్రకటన సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాకేష్ తికాయత్ వంటి వ్యక్తి ఈ తరహా ప్రకటన చేయడం సిగ్గుచేటని అన్నారు. కాగా, కోల్కతా ఘటన నేపధ్యంలో వైద్యుల భద్రతతో పాటు ఆస్పత్రుల్లో హింసాత్మక ఘటనల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం పదిమంది సభ్యులతో కూడిన జాతీయ టాస్క్ఫోర్స్ను నియమించింది.
Read More :
Subramanian Swamy: ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి