India | న్యూఢిల్లీ: కొత్త ఏడాది దేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లనున్నది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో పలు ప్రముఖ ఆలయాల ప్రారంభోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. వేటికవే సాటి అన్నట్టుగా ఆయా ఆలయాల నిర్మాణాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. నిర్మాణపరమైన అద్భుతాలు, సాంస్కృతిక వైభవం ఆ ఆలయాల్లో కనిపిస్తున్నాయి. కొత్త ఏడాది ప్రారంభం కానున్న ఆ మహాలయాలు, వాటి విశిష్టతలు, విశేషాలను ఒక్కసారి చూద్దాం.
అయోధ్య రామ మందిరం
ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరమైన అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ విధమైన ప్రకృత్తి విపత్తు వచ్చినా దాదాపు 2500 ఏండ్ల పాటు తట్టుకొనేలా నిర్మిస్తున్న ఈ ఆలయం పూర్తి కావొచ్చింది. రాముడి కొలువై ఉండే గర్భగుడిని అష్ఠభుజి ఆకారంలో నిర్మిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి దేశ, విదేశాలకు చెందిన వేలాది మంది ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.
శ్రీ మాయాపూర్ చంద్రోదయ మందిర్-పశ్చిమబెంగాల్
శ్రీ మాయాపూర్ చంద్రోదయ మందిర్ లేదా టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానేటేరియం(టీవోవీపీ) పశ్చిమబెంగాల్లోని మాయాపూర్‌లో నిర్మితం అవుతున్నది. 113 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా ఇది నిలువనున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్‌లు ఈ ఆలయానికి ఉన్నాయి. ఈ రాధా మాధవుడి ఆలయ ప్రధాన మందిరంలో ఒకేసారి 10 వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. 2010లో ప్రారంభమైన దీని నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. 2024 ఆఖరులో ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉన్నది.
శ్రీ జగన్నాథ్ పూరీ హెరిటేజ్ కారిడార్-ఒడిశా
దీన్ని జనవరి 17న భక్తులకు అంకితం చేయనున్నారు. ఒడిశాలోని ఐకానిక్ జగన్నాథుడి ఆలయం చుట్టూ 1.5 కిలోమీటర్ల మేర పరిసరాలను సుందరీకరణ చేయడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.943 కోట్లు. ఇది ఒడిశా ఆధ్యాత్మిక, సాంస్కృతిక చరిత్రలో గుర్తుంచుకోదగిన అడుగు కానున్నది.
విరాట్ రామాయణ ఆలయం-బీహార్
తూర్పు చంపారన్‌లో రూ.500 కోట్లతో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ ఆలయ నిర్మాణం 2024 చివరకు పూర్తి కానున్నది. 270 అడుగుల డోమ్ ఎత్తుతో ఈ ఆలయం అంగ్కోర్ వాట్ గుడిని దాటిపోనున్నది. 12 డోములతో కూడిన ఈ ఆలయాన్ని 3.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఆలయంలో 33 అడుగుల నల్ల గ్రానైట్ శివలింగం ఉంటుంది.