Famous Rama Temples | శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం. ఎంతో మంది శ్రీరాముడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. మర్యాద పురుషోత్తముడు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పుట్టాడని స్థలపురాణం చెబుతున్నది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం కావడంతో ప్రస్తుతం భారీ రామ మందిరం రూపుదిద్దుకున్నది. ఇప్పటికే ఆలయ పనులు పూర్తి కాగా.. సోమవారం రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రాణ ప్రతిష్ఠ చేయనుండగా.. దేశ విదేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు. అయోధ్యలో కొలువైన ఆలయంలో దర్శించుకునేందుకు ఏటా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయం చాలా మందికి తెలుసు. భారతదేశంలోనే శ్రీరాముడి ప్రముఖ ఆలయాలున్నాయి. ఈ ఆలయాల్లో శ్రీరాముడిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఆ క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం రండి..!

కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా త్రిప్రయార్‌లో రామస్వామి ఆలయం ఉన్నది. నాలుగు చేతుల్లో శంఖం, సుదర్శన చక్రం, విల్లు, దండం ఉంటాయి. ఈ ఆలయం కరువన్నూర్ నది ఒడ్డున ఉంది. దీన్నే త్రిప్రయార్ గుండా ప్రవహిస్తుండగా.. తీవ్రా నదిగా పిలుస్తుంటారు. ప్రస్తుతం కోజికోడ్, కొడంగల్లూర్లను కలిపే కనోలి కెనాల్లో భాగంగా ఉన్నది. శ్రీరాముడి విగ్రహాన్ని స్వయంగా కృష్ణుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆలయాన్ని దర్శించే భక్తులకు దుష్టశక్తుల నుంచి విముక్తి లభిస్తుందని భావిస్తుంటారు.

ఈ ఆలయం మహారాష్ట్రలోని నాసిక్‌లోని పంచవటిలో ఉంది. ఇక్కడ రెండు అడుగుల ఎత్తులో శ్రీరాముడు కొలువై ఉన్నాడు. వనవాస సమయంలో భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు పంచవటిలోనే ఉన్నట్లు స్థలపురాణం చెబుతున్నది. ఈ ఆలయాన్ని సర్దార్ రంగారు ఒదేకర్ నిర్మించారు. ఒదేకర్కు ఒక రోజు కలలో గోదావరి నదిలో శ్రీరాముడి నల్లని విగ్రహం ఉన్నట్లుగా కనిపించింది. మరుసటి రోజు అక్కడికి వెళ్లి చూడగా.. శ్రీరాముడి విగ్రహం కనిపించింది. ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించి.. అక్కడ ఆలయాన్ని నిర్మించారు.

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలోని భద్రాచలంలో సీతారామస్వామి ఆలయం ఉన్నది. కుడి చేతిలో బాణాన్ని, ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రాన్ని ధరించి ఉంటుంది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరుపర్వతం, మేనకల కుమారుడే భద్రుడు (భద్రగిరి). భద్రుడి కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రి రాముడిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని కంచర్ల గోపన్న అనే భద్రాచలం తహసీల్దార్‌గా ఉన్న సమయంలో విరాళాలు సేకరించి నిర్మించాడు. ప్రభుత్వానికి ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండలోని చెరసాలలో బంధించగా.. ఆయనను విడిపించేందుకు స్వయంగా రాముడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు దివ్య రూపంలో కనిపించి.. ఆలయ నిర్మాణానికి వెచ్చించిన సొమ్మును చెల్లించాడని ఆలయ చరిత్ర చెబుతున్నది.

ఈ రామరాజ ఆలయంలో మధ్యప్రదేశ్ ఓర్చాలో ఉన్నది. ఇక్కడ రాముడు రాజుగా పూజలందుకుంటున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ ఆలయం ఓ రాజభవనంలా ఉంటుంది. ప్రతి రోజు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తుంటారు. ఆలయంలో రాజుల తరహాలో పోలీసు సిబ్బందిని గార్డ్లుగా నియమించారు. ఆలయంలో రాముడికి ప్రతిరోజు సాయుధులు నమస్కరిస్తుంటారు. ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే రాముడి కుడిచేతిలో కత్తి, మరో చేతిలో కవచం ఉంటుంది. శ్రీరాముడు పద్మాసనంలో కూర్చొని, ఎడమ కాలును కుడి తొడ మీదుగా ఉంచి కూర్చొని కనిపిస్తాడు.

కనక భవన్ ఆలయం శ్రీరామ జన్మభూమికి కూతవేటు దూరంలో ఉంది. బంగారు ఆభరణాలు, బంగారు సింహాసనం కారణంగా దీన్ని కనక భవన్‌గా పిలుస్తుంటారు. ఈ ఆలయ ప్రధాన ప్రాకారం తూర్పు ముఖంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో భానుడి వెలుగులతో ఆలయ గోడలు అద్భుతంగా కనిపిస్తాయి. అయితే, శ్రీరాముడి కాలంలో ఈ కనక భవనాన్ని కైకేయి సీతాదేవికి శ్రీరాముడితో వివాహం అయిన తర్వాత కానుకగా ఇచ్చిందని ఇక్కడి భక్తుల విశ్వాసం. కనక భవనం శిథిలావస్థకు చేరిన తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మించాడని చరిత్ర చెబుతున్నది. మధ్యయుగ కాలంలో చక్రవర్తి విక్రమాదిత్య పునర్నిర్మించాడని, ఆ తర్వాత ఓర్చా రాణి వృషభాను కున్వారి పునరుద్ధరించినట్లు స్థల పురాణం చెబుతున్నది. గర్భాలయంలో సీతాదేవితో కలిసి శ్రీరాముడు దర్శనమిస్తాడు.

పంజాబ్ అమృత్ సర్‌లో శ్రీరామ తీర్థ ఆలయం కొలువై ఉంది. అమృత్‌సర్‌కి పశ్చిమాన 11 కిలోమీటర్ల దూరంలో అమృత్సర్ లోపోకే రహదారిపై ఉంది. రామాయణకాలం సమయంలో భగవాన్ వాల్మీకి ఇక్కడి ఆశ్రమంలో ఉండేవారని స్థల పురాణం చెబుతున్నది. ఇక్కడే కొంతకాలం సీతమ్మవారు ఉన్నారని.. ఈ ప్రదేశంలోనే లవకులు జన్మించిన ప్రదేశం సైతం ఇదే. భగవాన్ వాల్మీకి తీర్థ్ ఆస్థానం డెవలప్మెంట్ బోర్డు ఆలయ బాధ్యతలు చూసుకుంటున్నది.

కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో కోదండ రామస్వామి దేవస్థానం ఉన్నది. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. హిరమగళూరులో పరశురాముడు తన వివాహం వేడుకను చూపించాడని రాముడిని కోరాడని స్థలపురాణం చెబుతున్నది. కోదండ రాముడి విగ్రహానికి కుడి వైపున సీతమ్మ, ఎడమ వైపున లక్ష్మణుడి విగ్రహాలు కనిపిస్తాయి. రామ, లక్ష్మణులు తమ కుడిచేతుల్లో బాణాలు, ఎడమచేతుల్లో ధనుస్సులు ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ సిద్ధ పుష్కరణి అని పిలిచే చెరువు ఉంటుంది. ఇక్కడ తొమ్మిది సిద్ధులు నివాసం ఉండేవారు. అలాగే పరశురాముడు సైతం ఇక్కడ నివసించినందుకు దీన్ని భార్గవపురి లేదంటే భార్గవ పట్టణంగా పురాణాలు పేర్కొన్నాయి.

రామస్వామి దేవాలయం కుంభకోణంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తుంటారు. ఎక్కడైనా ఆలయాల్లో సీతారాములతో పాటు ఆయన లక్ష్మణుడు కనిపిస్తుంటాడు. ఈ కానీ భరతుడు, శత్రుజ్ఞులు విగ్రహాలు సైతం ప్రతిష్ఠించబడ్డ ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం కావేరీ నది ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయం తంజావూరు నాయక రాజు అచ్యుతప్ప నాయక్ (1560-1614) కాలంలో ప్రారంభించగా.. రఘునాథ నాయక్ (1600-34) పాలనలో పూర్తి అయ్యింది. ఆలయ స్తంభాలపై వివిధ హిందూ ఇతిహాసాలను వర్ణించే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. రామాయణం మొదటి ఆవరణలో మూడు విభాగాలలో చిత్ర రూపంలో చిత్రీకరించారు.