చెన్నై: తక్కువ కులం వ్యక్తిని ప్రేమించిన మహిళ తన ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. కుటుంబ సభ్యులు గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. మహిళ మరణంపై ప్రియుడు అనుమానం వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులే ఆమెను చంపి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేయగా పరువు హత్యగా తేలింది. (honour killing) తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పారువై గ్రామానికి చెందిన 22 ఏళ్ల విద్య, కోయంబత్తూరులోని ప్రభుత్వ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నది. క్లాస్మేట్ వేణ్మణితో ఆమెకు ప్రేమ సంబంధం ఉన్నది.
కాగా, మార్చి 30న పారువైలోని తన ఇంటిలో విద్య అనుమానాస్పదంగా మరణించింది. తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఆమె తలపై బీరువా పడటంతో ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే విద్య మరణంపై ఆమె ప్రియుడు వేణ్మణి అనుమానం వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులే ఆమెను చంపి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సిబ్బందితో కలిసి ఖననం చేసిన విద్య మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్మార్టం నిర్వహించగా తలపై కొట్టిన గాయంతో ఆమె చనిపోయినట్లు తేలింది.
మరోవైపు విద్య కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. అట్టడుగు వర్గానికి చెందిన వేణ్మణితో ఆమెకు సంబంధం ఉండటంతో హత్య చేసినట్లు సోదరుడు శరవణన్ ఒప్పుకున్నాడు. ఇనుప రాడ్తో విద్య తలపై కొట్టి చంపినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. విద్య తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.