చెన్నై: ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు పార్క్ చేసిన కారులో శవమై కనిపించారు. (Family dead inside car) రెండు రోజులుగా రోడ్డు పక్కగా కారు నిలిచి ఉండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఐదుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పుదుకొట్టై-మధురై హైవేలోని నామనసముద్రంలో సెప్టెంబర్ 24 నుంచి ఒక కారు నిలిచి ఉంది. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు ఆ కారు పట్ల అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. కారును పరిశీలించగా ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు సీట్లలో మరణించి ఉన్నారు.
కాగా, సేలంలో నివసించే 50 వేళ్ల వ్యాపారవేత్త మణికందన్, భార్య నిత్య, తల్లి సరోజ, పిల్లలైన 17 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తెగా మృతులను గుర్తించారు. వారు విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక సూసైడ్ నోట్‌ను కూడా ఆ కారులో గుర్తించారు.
మరోవైపు మెటల్ వ్యాపారం చేసే మణికందన్ అప్పుల్లో కూరుకుపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి నేపథ్యంలో ఆ కుటుంబం కారులో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.