ముంబై: ఒక వృద్ధుడు గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని మంచంపై మోశారు. (Family Carries Injured Man On Cot) పడవలో నీటి ప్రవాహాన్ని దాటారు. సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ నదిపై వంతెన లేకపోవడంతో ఆ గ్రామస్తులకు ఈ అవస్థలు తప్పడం లేదు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భట్పర్ గ్రామానికి చెందిన 67 ఏళ్ల గిరిజనుడు మల్లు మజ్జి గురువారం పొలంలో పని చేస్తుండగా గాయపడ్డాడు.
కాగా, ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లా సమీపంలోని భామ్రాగఢ్ వద్ద గ్రామీణ ఆసుపత్రి ఉంది. భట్పర్ గ్రామం నుంచి ఆ ఆసుపత్రికి చేరేందుకు 14 కిలోమీటర్లు ప్రయాణించాలి. అది కూడా నదీ ప్రవాహాన్ని దాటి కాలి నడకన అక్కడకు చేరుకోవాలి. దీంతో మల్లు కుమారుడు పుసు, మరికొందరు కలిసి మంచాన్ని తాత్కాలిక స్ట్రెచర్గా మార్చారు. గాయపడిన మల్లును ఆ మంచంపై మోశారు. పడవల ద్వారా నదీ ప్రవాహాన్ని దాటారు. గ్రామీణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మల్లును మంచంపై మోసి తిరిగి గ్రామానికి చేరుకున్నారు.
మరోవైపు ఈ సంఘటనపై వైద్యాధికారులు స్పందించారు. భట్పర్ గ్రామానికి చెందిన వారు వైద్య సదుపాయం కోసం వంతెన లేని నదీ ప్రవాహాన్ని దాటాల్సి ఉంటుందని తెలిపారు.