Falta repoll : పశ్చిమ బెంగాల్లో మిగిలి ఉన్న మరో అసెంబ్లీ సీటును కూడా బీజేపీ దక్కించుకుంది. ఫాల్టా అసెంబ్లీ సీటుకు జరిగిన రీపోలింగ్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి దేవాన్షు పాండా 1,09,021 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇది గతంలో టీఎంసీ కంచుకోట కావడం విశేషం. 2011 నుంచి ఇక్కడ వరుసగా టీఎంసీ గెలుస్తూ వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి పోటీకి ముందే ఎన్నికనుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
ఆదివారం వెలువడిన ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి దేవాన్షుకు1,49,666 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత సీపీఎం అభ్యర్థి శంభు కుమ్లికి 40,645 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి అబ్దర్ రజాక్ మొల్లాకు 10,084 ఓట్లు పోలయ్యాయి. అయితే, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఆయనకు 7,783 ఓట్లు రావడం విశేషం. ఈ ఫలితంపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందించారు. ఈ ఫలితం స్వేచ్ఛాయుతంగా జరిగిన ఎన్నికలకు నిదర్శనం అన్నారు. ఫాల్టా నియోజకవర్గానికి ఏప్రిల్ 29నే మిగతా అసెంబ్లీలతో కలిసి ఎన్నిక జరిగింది. కానీ, అక్కడ తీవ్ర ఘర్షణలు, ఈవీఎంలలో అవకతవకల కారణంగా ఎన్నికను రద్దు చేసి, ఈ నెల 21న నిర్వహించారు.
మొత్తం 285 పోలింగ్ స్టేషన్లలో ఈ ఎన్నిక జరిగింది. కేంద్ర బలగాల గట్టి భద్రత మధ్య ఈ రీపోలింగ్ జరిగింది. అయితే, పోటీకి ముందే తమ అభ్యర్థి తప్పుకోవడంపై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ నేతలు బెదిరించారని ఆరోపించారు. ఎన్నికలకు ముందే నియోజకవర్గాన్ని వీడి వెళ్లాల్సిందిగా తమను బలవంతం చేశారని చెప్పారు. ఎన్నికలకంటే పది రోజుల ముందు నుంచి దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు నియోజకవర్గం వీడి వెళ్లిపోయారని బెనర్జీ అన్నారు. బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ ఆఫీసుపై దాడి చేసి ధ్వంసం చేశారని, అయినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వ్యవహరించిందని, బాధితులపై ఎలాంటి చర్యా తీసుకోలేదన్నారు.