Fake soldier arrest | ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో మరో తప్పిదం జరిగింది. నాలుగు రోజుల క్రితం కర్ణాటక పర్యటనలో ఓ వ్యక్తి మోదీ సమీపానికి వచ్చి పూలదండ అందించాడు. ఈ సారి మాత్రం ఏకంగా నకిలీ జవాన్ ర్యాలీలోకి చొరబడ్డాడు. అతడిని పసిగట్టిన ప్రధాని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆయన ఎందుకలా చేయాల్సి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ప్రధాని మోదీ ముంబై పర్యటనలో నకిలీ జవాన్ పట్టుబడటం కలకలం రేపింది. కార్యక్రమానికి ప్రధాని రావడానికి 90 నిమిషాల ముందు నకిలీ సైనికుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చగా.. కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. గురువారం మహారాష్ట్రలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే, ప్రధాని కార్యక్రమం వేదిక వద్దకు చేరుకుంటుండగా.. ఒక వ్యక్తి అక్కడ తచ్చాడటాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
గార్డ్స్ రెజిమెంట్‌కు చెందిన నాయక్‌గా చెప్పుకున్న సదరు నకిలీ జవాను.. అత్యంత భద్రత ఉన్న వీవీఐపీ ఏరియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం కూడా చేశాడు. నిందితుడిని సైన్స్ గ్రాడ్యుయేట్ రామేశ్వర్ మిశ్రా (35) గా గుర్తించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 171, 465, 468, 471 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని శుక్రవారం బాంద్రా కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అతడిని జనవరి 24 వరకు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఎందుకలా నకిలీ సైనికుడిగా అవతారమెత్తాల్సి వచ్చింది..? ఈయనకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి..? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.