రాయ్‌పూర్: మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేరుతో నకిలీ బ్రాంచ్‌ను తెరిచారు. (Fake SBI Branch) కొందరు వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగులుగా నియమించారు. ఆ బ్రాంచ్‌లో బ్యాంకు కార్యకలాపాలు కూడా ప్రారంభించారు. గ్రామస్తుల నుంచి డబ్బులు జమ చేసుకున్నారు. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌కు సమాచారం అందడంతో ఈ మోసం బయటపడింది. ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు భారీ బ్యాంకింగ్ మోసాన్ని పక్కాగా ప్లాన్ చేసి అమలు చేశారు. మారుమూల ప్రాంతమైన ఛపోరా గ్రామంలో ఏకంగా ఎస్బీఐ పేరుతో నకిలీ బ్రాంచ్‌ను తెరిచారు. కాంప్లెక్స్‌లోని షాపును అద్దెకు తీసుకున్నారు. నిజమైన బ్యాంకుగా నమ్మించేందుకు ఫర్నీచర్‌తోపాటు క్యాష్ కౌంటర్ వంటివి ఏర్పాటు చేశారు.
కాగా, బ్యాంకు ఉద్యోగాల పేరుతో రెండు నుంచి ఆరు లక్షల వరకు మహిళలతో సహా ఆరుగురు వ్యక్తుల నుంచి డబ్బులు దండుకున్నారు. వారికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడంతోపాటు శిక్షణ కూడా ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరుతో వారు బ్యాంకు విధులకు హాజరయ్యారు. ఎస్బీఐ కొత్త బ్రాంచ్ ఏర్పాటు పట్ల గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. లావాదేవీల కోసం ఆ బ్రాంచ్‌కు వెళ్లారు.
అయితే సుమారు పది రోజుల పాటు పని చేసిన ఎస్బీఐ నకిలీ బ్రాంచ్ గురించి సమీపంలోని దబ్రా బ్రాంచ్ మేనేజర్ దృష్టికి వచ్చింది. ఈ బ్రాంచ్ పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సెప్టెంబర్ 27న ఎస్బీఐ అధికారులు, పోలీసులు కలిసి అక్కడకు వెళ్లారు. అచ్చం ఎస్బీఐ బ్రాంచ్ మాదిరిగా కనిపించడంతోపాటు బ్యాంకింగ్ సేవలు నిర్వహిస్తున్న నకిలీ బ్రాంచ్‌ను చూసి వారు కంగుతిన్నారు.
మరోవైపు నకిలీ బ్రాంచ్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు నకిలీ నియామక పత్రాలు ఇచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ నకిలీ బ్రాంచ్‌కు మేనేజర్‌గా వ్యవహరించిన పంకజ్‌తోపాటు రేఖా సాహు, మందిర్ దాస్‌తో సహా నలుగురు ఈ స్కామ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తులు డబ్బులు పోగొట్టుకోగా, నిజంగా బ్యాంకు ఉద్యోగమని నమ్మి నియామక పత్రాలు పొందిన వారు కూడా చిక్కుల్లో పడ్డారు.