UBT Vs Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్లు శరద్ పవార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తన వారసుడిని నియమించేందుకు ప్యానెల్‌ను సైతం నియమించారు. పవార్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కమిటీ సైతం రాజీనామాను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దాంతో పవార్ రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజకీయ కురువృద్ధుడైన శరద్ పవార్ రాజీనామాను ఉపసంహరించుకోవడంపై ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ విమర్శలు గుప్పించింది. పవార్ తన వారసుడిని ప్రకటించడంలో విఫలమయ్యారని, కొత్త అధ్యక్షుని ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో చాలా మంది సభ్యులు అధికార బీజేపీతో కలిసి వెళ్లేందుకు పని చేస్తున్న వారే ఉన్నారంటూ శివసేన మౌత్ పీస్ ‘సామ్నా’ ప్రత్యేక కథనం ప్రచురించింది. అయితే, కథనంపై శరద్ పవార్ స్పందించారు. సతారాలో విలేకరులతో మాట్లాడారు.
తన పార్టీ నేతలు ఇతరులు చెప్పే వాటిని పట్టించుకోరని, మనం ఏం చేస్తున్నామో మాకు తెలుసు కాబట్టి అలాంటి కథనాల (సామ్నా కథనాలు)కు ప్రాధాన్యం ఇవ్వరన్నారు. 1999లో కాంగ్రెస్, ఎన్సీపీ అధికారంలోకి వచ్చాయని.. ఆ తర్వాత ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, అజిత్ పవార్, దిలీప్ వాల్సే పాటిల్, ఆర్ఆర్ పాటిల్‌కు మంత్రి పదవులు దక్కాయన్నారు. తాను రాష్ట్ర మంత్రిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించానన్నారు. 1999 కేబినెట్లో మంత్రులుగా చేసిన వారందరినీ మహారాష్ట్రం మొత్తం చూసిందన్నారు.