న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలోని అత్యుత్తమ ప్రభుత్వ వైద్య సంస్థలైన అఖిల భారత వైద్య శాస్ర్తాల సంస్థ(ఎయిమ్స్) బోధనా సిబ్బంది కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న 21 ఎయిమ్స్‌లో 2025-26 సంవత్సర కాలంలో గడచిన నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 40 శాతానికి పైగా బోధనా సిబ్బంది కొరత ఏర్పడింది. కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రతాప్రావు జాదవ్ బుధవారం ఈ వివరాలను రాజ్యసభలో వెల్లడించారు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఈ వైద్య సంస్థలలో మానవ వనరుల సంక్షోభం ఏర్పడడం ఆందోళన కలిగించే అంశం.
మంజూరైన మొత్తం ఫ్యాకల్టీ(బోధనా సిబ్బంది) పదవులు 6,376 కాగా అందులో 2,561 ఖాళీలు ఈ ఏడాది ఉన్నాయి. దీంతో ఖాళీల సంఖ్య 40.2 శాతంగా నిలిచింది. 2022-23లో చివరిగా అత్యధికంగా 2,099 ఖాళీలు భర్తీ చేయలేదు. కొత్తగా ఏర్పాటుచేసిన ఎయిమ్స్ క్యాంపస్‌లలోనే సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. జమ్ము కశ్మీరులోని అవంతిపురాలో 2023-24లో ఎయిమ్స్ ఏర్పడగా మంజూరైన 94 బోధనా సిబ్బందిలో ఒక్కరు కూడా నియమితులు కాలేదు. మదురై ఎయిమ్స్‌కి 183 బోధనా సిబ్బంది మంజూరు కాగా కేవలం 49 మంది మాత్రమే నియమితులయ్యారు.
ప్రభుత్వం చెల్లించే జీతాలు తక్కువగా ఉండడం, ప్రైవేట్ రంగంలో మెరుగైన ప్రయోజనాలు ఉండడమే ఫ్యాకల్టీ కొరతకు కారణంగా తెలుస్తోంది. బోధనా సిబ్బంది లేకపోవడం వైద్య విద్య నాణ్యతను దెబ్బతీస్తుందని ఎయిమ్స్ భోపాల్ మాజీ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ అజయ్ సింగ్ తెలిపారు. డాక్టర్ల శిక్షణపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.