Delhi Pollution : ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజురోజుకు తీవ్రమవుతోంది. అక్కడ గాలి నాణ్యత (Air quality) మరింత క్షీణించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice SuryaKant) ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం తాను గంటపాటు వాకింగ్‌కు వెళ్లడంతో శ్వాస సంబంధ సమస్య ఎదురైనట్లు తెలిపారు.
సుప్రీంకోర్టు విచారణలను వర్చువల్ మోడ్‌కు మార్చడానికి బార్ అసోసియేషన్ అంగీకరిస్తే.. కోర్టు ఏకరీతి నియమాన్ని రూపొందించడానికి చర్యలు తీసుకుంటామని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. గత రెండు వారాలుగా వాయు నాణ్యత సూచీలు దారుణంగా పడిపోతుండటం, తీవ్ర కాలుష్యంవల్ల ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో 60 ఏళ్లు పైబడిన న్యాయవాదులు వ్యక్తిగతంగా కోర్టుకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, వారు వర్చువల్ విధానంలో విచారణకు హాజరుకావడానికి అనుమతించాలని సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది విజ్ఞప్తి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సైతం రాకేష్ ద్వివేది వ్యాఖ్యలతో ఏకీభవించారు. 60 ఏళ్ల వయసులో తాము వాయు కాలుష్యంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ తాను కూడా ఇబ్బంది పడుతున్నానని అన్నారు. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం రెండు వారాల క్రితమే ఢిల్లీ కాలుష్యంపై న్యాయవాదులను హెచ్చరించింది. పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు న్యాయవాదులు స్వయంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని, వర్చువల్ హియరింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని లాయర్లకు సూచించింది. ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని తెలిపింది.
ఇదిలావుంటే రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ తీవ్రంగా పడిపోతుండటంతో పర్యావరణ శాఖ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో 50 శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని, మిగిలిన సగం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986లోని సెక్షన్ 5 నిబంధన ప్రకారం ఈ ఆదేశాలు జారీచేసింది.