Facebook saving | ఫేస్బుక్.. మనకు సంబంధించిన వారికి మన సమాచారాన్ని చేరవేసుకునేందుకు తీసుకొచ్చిన ఒక టెక్నాలజీ. అయితే, మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ ప్రారంభ రోజుల్లో చెప్పిన దానికి.. ఇప్పుడు మనం చూస్తున్నదానికి పొంతన లేకుండా పోతున్నది. ఇప్పుడు ఫక్తు ఫేక్బుక్గా మారిపోయింది. అయినప్పటికీ అడపాదడపా మన సమాజానికి ఎదో రూపంలో సేవ చేస్తున్నదని చెప్పవచ్చు. ఇందుకు ఫేస్బుక్ అధికారులు స్పందించిన తీరే తాజా ఉదహరణగా చెప్పుకోవచ్చు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అభయ్ శుక్లా అనే యువకుడు ఇన్స్టాగ్రాం లైవ్‌లో ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఈ వీడియో కాలిఫోర్నియాలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం మాతృసంస్థ మెటా హెడ్‌క్వార్టర్స్‌లో కనిపించింది. దాంతో వెంటనే స్పందించిన అక్కడి ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు చేరవేశారు. దాంతో ఆ యువకుడి మొబైల్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు అభయ్ శుక్లా ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగారు. ఈ కేసులో విశేషమేమిటంటే.. అమెరికా నుంచి అలర్ట్ పంపినప్పటి నుంచి పోలీసులు యువకుడి ఇంటికి వచ్చేసరికి 13 నిమిషాల సమయం మాత్రమే పట్టింది. దాదాపు 6 గంటలపాటు శుక్లాతోపాటు అతడి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ చేసిన అనంతరం అప్పగించారు.
ఫేస్బుక్ లేదా ఇన్‌స్టాగ్రాంలో ఎవరిదైనా ఆత్మహత్యకు సంబంధించిన పోస్ట్ కనిపిస్తే వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేలా ఉత్తరప్రదేశ్ పోలీసులు గత ఏడాది మార్చిలో మెటా కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. దాంతో మంగళవారం రాత్రి 9.57 గంటలకు ఘజియాబాద్‌లో ఆత్మహత్యాయత్నం చేస్తున్న లైవ్ టెలికాస్ట్‌ను కాలిఫోర్నియాలోని మెటా కంపెనీ సిబ్బంది గుర్తించారు. వెంటనే యూపీ పోలీసులను అలర్ట్ చేశారు. దాంతో ఘజియాబాద్‌లోని విజయనగర్ పీఎస్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని అభయ్ శుక్లాను ఆత్మహత్య చేసుకోకుండా అడ్డుకున్నారు. కన్నౌజ్‌కు చెందిన అభయ్ శుక్లా ప్రస్తుతం ఘజియాబాద్‌లో నివసిస్తున్నాడు. గురుగావ్‌లోని ఓ సంస్థలో పాత మొబైల్స్ కొని అవసరమున్న వారికి అమ్మే వాడు. అక్కడ పనిచేసి మానేసి అక్కడ నేర్చుకున్న మార్కెంటింగ్‌ను తిరిగి సొంతంగా ప్రారంభించాడు. ఈ వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు రావడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చాడు.