లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పదుల సంఖ్యలో విద్యార్థులు కూడా వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఘజియాబాద్‌లో ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు సెక్షన్ 144 విధించారు. బహిరంగ ప్రదేశాల్లో నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించారు. దీనిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ పోలీసులు సోమవారం హెచ్చరించారు.
కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యూపీలో మళ్లీ ఆంక్షలను అమలు చేస్తున్నారు. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న గౌతమ్ బుద్ధనగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్పత్, లక్నోలోని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ నిబంధన సోమవారం నుంచి అమలు చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు కరోనా కేసుల పెరుగుదలపై దృష్టిసారించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. కరోనా టెస్ట్‌లను పెంచాలని సూచించారు. దీంతో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న యూపీలోని పలు ప్రధాన నగరాల్లో కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.