Ahmed Patel | త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అధికార బీజేపీ తన తండ్రి అహ్మద్ పటేల్‌పై కల్పితాలు, అబద్ధాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారని అహ్మద్ పటేల్ తనయ ముంతాజ్ పటేల్ అన్నారు. 2002 అల్లర్ల సందర్భంగా అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు గుజరాత్లో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కుట్ర చేశారని మేజిస్ట్రేట్ కోర్టు దాఖలు చేసిన చార్జిషీట్లో సిట్ ఆరోపించింది.
దీనిపై అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ స్పందించారు. `ఇదొక తరహా గుజరాత్ ఎన్నికల ప్రచారం. ప్రతిఏటా ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త వివాదం సృష్టిస్తారు. కొన్నేండ్ల క్రితం వరకు ఈ అంశాన్ని బయటపెట్టలేదు. కేంద్రా (ప్రభుత్వ)నికి ఈ సంగతి తెలుసుంటే కనీసం గత ఎనిమిదేండ్లుగా ఎందుకు బయటపెట్టలేదు?` అని ట్వీట్ చేశారు. `మీకు ఒక పెద్ద నేత పేరు కావాలి. ప్రకటనలు, వాటికి సాక్ష్యాలు ఎలా వస్తాయో మాకు తెలుసు. ఎవరైనా ప్రకటన చేయొచ్చు. దాన్ని ధృవీకరించేది ఎవరు?` అని ప్రశ్నించారు.
`కుట్ర సిద్ధాంతాల ద్వారా అహ్మద్ పటేల్ పేరును బయటకు లాగి గుజరాత్లో వారి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆయన మరణించిన తర్వాత కూడా బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ముందే వారు ఈ అంశం లేవనెత్తారు` అని ముంతాజ్ పటేల్ ట్వీట్ల వర్షం కురిపించారు. గుజరాత్ ప్రతిష్టను మసకబార్చేందుకు అహ్మద్ పటేల్, సోనియాగాంధీ కుట్ర పూరితంగా వ్యవహరించారని బీజేపీ ఆరోపించింది. సిట్ దర్యాప్తులో నిజాలు వెలుగు చూశాయని బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్ర మీడియాతో అన్నారు.