న్యూఢిల్లీ, అక్టోబర్ 21: హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(దాదాపు రూ. 88 లక్షలు) పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెలరోజుల తర్వాత ఫీజును ఎలా చెల్లించాలో, ఈ ఫీజు నుంచి ఎవరికి మినహాయింపు లభిస్తుందో వివరాలు వెల్లడించింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) సోమవారం ఫీజు పేమెంట్ పోర్టల్‌ను ప్రవేశపెడుతూ ఫీజు చెల్లించినట్లు రసీదు సమర్పించిన దరఖాస్తుదారులు మాత్రమే తదుపరి అడుగులు వేయాలని, అయితే కొందరు స్టూడెంట్ వీసాదారులకు మాత్రం ఫీజు రాయితీ ఉంటుందని తెలిపింది.
ఎఫ్-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్-1 వీసాలపై ఉన్న ప్రొఫెషనల్స్‌తోసహా ప్రస్తుత వీసాదారులు హెచ్-1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు లక్ష డాలర్లను చెల్లించవలసిన అవసరం లేదని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రం కొత్త ఫీజు వర్తిస్తుందనిగ్రీన్ అండ్ స్పీగెల్‌కు చెందిన డాన్ బెర్గెర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అమెరికాను వీడి ఉండి ప్రస్తుత హెచ్-1బీ వీసాపై దేశంలోకి తిరిగి ప్రవేశించడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి కొత్త ఫీజు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు దరఖాస్తుదారు అర్హుడు కాదని తాము నిర్ధారిస్తే కంపెనీ యజమాని ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉంటుందని యూఎస్సీఐఎస్ పేర్కొంది.
‘భారతీయులను ఎన్నటికీ నమ్మకూడదు’
వైట్‌హౌజ్ ‘స్పెషల్ కౌన్సెల్’గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన పాల్ ఇంగ్రాసియా(రిపబ్లకన్ల తరఫు న్యాయవాది) విద్వేష వ్యాఖ్యలు చేశారు. ‘చైనీయులను, భారతీయులను ఎన్నటికీ నమ్మవద్దు’ అంటూ ఇంగ్రాసియా గతంలో చేసిన వ్యాఖ్యల్ని ‘పొలిటికో’ (డిజిటల్ న్యూస్‌పేపర్) బయటపెట్టింది. తోటి రిపబ్లికన్లతో జరిగిన గ్రూప్ చాట్‌లో ఆయన పంపిన సందేశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
‘రష్యా చమురు’ కొనుగోలు ఆపకపోతే భారీ సుంకాలు
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తానని భారత ప్రధాని మోదీ తనకు చెప్పారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. మోదీ తన మాట నిలబెట్టుకోని పక్షంలో భారీ స్థాయిలో సుంకాలను భారత్ ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. చమురు కొనుగోలును నిలిపివేయని పక్షంలో భారీ స్థాయిలో సుంకాల చెల్లింపును భారత్ కొనసాగించవలసి వస్తుందని సోమవారం ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన హెచ్చరించారు.
రష్యన్ ముడి చమురు కొనుగోలు ద్వారా యుద్ధానికి పెట్టుబడి పెట్టి పుతిన్‌కి భారత్ సాయపడుతోందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాగా, ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ ట్రంప్ భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే పరిష్కరించినట్లు మరోసారి వెల్లడించారు. రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల పోరులో విమానాలు కూడా కూలిపోయాయని ఆయన చెప్పారు. అయితే అవి ఎవరికి చెందిన విమానాలు అన్న వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. సుంకాల హెచ్చరికలే అణ్వస్త్ర దేశాలైన భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపాయి. ఏడు విమానాలు కూలిపోయాయి. అయినా వారి మధ్య యుద్ధం ఆగడం లేదు. లేకపోతే అణు యుద్ధమే జరిగి ఉండేది అని ట్రంప్ చెప్పారు.