న్యూఢిల్లీ: లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా దేశాల మాదిరి మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని ఆర్మీలో 40 ఏండ్లు పనిచేసి రిటైర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిశికాంత సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పటంపై ఉన్నతస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆర్మీ మాజీ చీఫ్ వీపీ మాలిక్ అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌ల ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేస్తూ, తన సందేశాన్ని పంపారు. ఇదిలా ఉండగా, హింసను అరికట్టలేక సీఎం ఎన్ బీరేన్‌సింగ్ చేతులెత్తేశారని వార్తలు వెలువడ్డాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నా, మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనటం లేదని సమాచారం. శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ వ్యాఖ్యానించటం గమనార్హం. ఇంఫాల్‌లోని ఆయన ఇంటికి కొంతమంది దుండగులు నిప్పు పెట్టడం తెలిసిందే. మణిపూర్‌లో హింసను అరికట్టకుండా మోదీ అమెరికాలో పర్యటించడమేంటని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే విరుచుకు పడ్డారు. మన్‌కీ బాత్‌లో అనేక విషయాలు ప్రస్తావించే మోదీ మణిపూర్ విషయలో మాత్రం మౌన్ కీ బాత్లాగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది.