Bombay High Court | ముంబై, ఏప్రిల్ 19: వివాహేతర సంబంధం విడాకులు మంజూరు చేసేందుకు ఒక కారణంగా సరిపోతుంది కానీ, పిల్లల సంరక్షణ బాధ్యత అప్పగించే విషయంలో కాదని ఓ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. తొమ్మిదేండ్ల కూతురి సంరక్షణను తల్లికి అప్పగిస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ పాటిల్ తాజాగా తీర్పునిచ్చారు. 2023 ఫిబ్రవరిలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ భర్త వేసిన పిటిషన్ను ఈ నెల 12న కొట్టివేశారు. తన క్లయింట్ భార్యకు వివాహేతర సంబంధం ఉన్నదని, కూతురి కస్టడీని ఆమెకు అప్పగించడం సరికాదని పిటిషనర్ న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలను జస్టిస్ పాటిల్ తిరస్కరించారు. మంచి భార్య కాకపోయినందున, ఒక మంచి తల్లి కూడా కాకుండా పోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.