న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్‌కు (S Jaishankar) కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతను పెంచింది. ఆయన కాన్వాయ్‌లోకి ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును జతచేసింది. ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఆర్పీఎఫ్ కమాండోలతో జడ్ కేటగిరీలో భద్రత కొనసాగుతున్నది. ఇందులో భాగంగా అనునిత్యం ఆయనకు రక్షణగా 33 మంది కమాండోల బృందం రక్షణగా ఉంటున్నది.
సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వీఐపీల భద్రతపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా సీనియర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జై శంకర్‌తోపాటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కేంద్ర మంత్రులు, ఎంపీలకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
దేశంలో మూడో అత్యున్నత స్థాయి భద్రత జడ్ కేటగిరీ. దీనిని అత్యంత కీలక వ్యక్తులకు, ముఖ్యంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు కేటాయిస్తారు. ఈ కేటగిరిలో 22 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన 4 నుంచి 6 మంది కమాండోలు, స్థానిక పోలీసు సిబ్బంది ఉంటారు. కాగా, 2023, అక్టోబర్‌లో జై శంకర్ భద్రత స్థాయిని జడ్ కేటగిరీకి పెంచారు. అప్పటివరకు ఆయన వై కేటరిగీలో ఉండేవారు.