భారత్, చైనా మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో లేవని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఎంత మేర భద్రతా దళాలు ఉండాలన్నది 1993-96 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయని, ఆ ఒప్పందాలకు విరుద్ధంగా ఇప్పుడు సరిహద్దుల్లో భద్రతా దళాలున్నాయని జైశంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్యూ తో దాదాపు మూడు గంటల పాటు ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత జైశంకర్ విలేకరులతో మాట్లాడారు. సైన్యాన్ని ఉపసంహరిస్తేనే ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటాయని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 2020 తర్వాత చైనా చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాల్లో చాలా ఇబ్బందులు తలెత్తాయని తేల్చి చెప్పారు. తూర్పు లడఖ్‌తో పాటు ఉక్రెయిన్‌కి సంబంధించిన విషయాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయని ఆయన వెల్లడించారు. ఎలాంటి అరమరికలు లేకుండా, అత్యంత నిజాయితీగా తమ మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. భారత్ తో సంబంధాల విషయంలో చైనా స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశామని, నిర్ణయాధికారంలో ఇతర దేశాల జోక్యం ఉండదన్న విశ్వాసాన్ని తాము వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూడా చైనా విదేశాంగ మంత్రితో చెప్పామని జైశంకర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
ఇక పాకిస్తాన్ వేదికగా జరిగిన ఇస్లామిక్ దేశాల సమావేశంలో జమ్మూ కశ్మీర్ అంశంపై చైనా చేసిన వ్యాఖ్యలపై కూడా తాము చర్చించామని, ఈ అంశాన్ని కూడా చర్చల సందర్భంగా లేవనెత్తామని జైశంకర్ పేర్కొన్నారు. అసలు ఈ వ్యాఖ్యలపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్న విషయాన్ని కూడా కూలంకషంగా చైనా దృష్టికి తీసుకొచ్చామని ఆయన తెలిపారు.