Chandrayan 3 | శ్రీహరికోట, జూలై 14: భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడి గురించి మానవులకు ఇప్పటికీ తెలిసింది చాలా తక్కువే. భూమితో పోల్చితే చంద్రుడిపై పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చంద్రుడి గురుత్వ శక్తి కూడా భూమి గురుత్వ శక్తిలో ఎనిమిదో వంతే ఉంటుంది. చంద్రుడిపై నీటి జాడలను కనుగొనేందుకు అమెరికా, రష్యా వంటి దేశాలు దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. చివరకు చంద్రుడి ఉపరితలం కింద ఘనీభవించిన స్థితిలో నీరు ఉన్నదని మన చంద్రయాన్-1 ద్వారా పంపిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ గుర్తించింది. ఆ ఉత్సాహంలో మరిన్ని పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావటంతో మన అధ్యయనం కాస్త ఆలస్యమైంది. తాజాగా చంద్రయాన్-3ని రెట్టించిన ఉత్సాహంతో ఇస్రో ప్రయోగించింది. దీని ద్వారా చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నది.
రెండు ముఖ్యమైన పరిశోధనల కోసం
చంద్రయాన్-3 ద్వారా పంపిన రోవర్ చంద్రుడిపై అనేక పరిశోధనలు చేయనున్నది. చంద్రుడి ఉపరితలంపై మట్టిలో ఎలాంటి మూలకాలున్నాయి? వాతావరణంలో ఎలాంటి వాయువులు ఉన్నాయి? చంద్రుడి వాతావరణంలో ఉన్న విద్యుదావేశ కణాల పరిస్థితి ఏమిటి? చంద్రుడిపై భూకంపాలు ఎందుకు, ఎలా సంభవిస్తున్నాయి? అనే విషయాలను రోవర్ అధ్యయనం చేస్తుంది. ఈ పరిశోధనల కోసం రోవర్‌తో కలిపి 5 పరికరాలను పంపారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి 650 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ ల్యాండర్, రోవర్ దిగుతాయి. ఈ ప్రదేశంలో ఇప్పటివరకు ఏ దేశమూ పరిశోధనలు నిర్వహించలేదు. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ‘చంద్రయాన్-3 రోవర్ ఇప్పటివరకు ఎవ్వరూ చేయని రెండు ముఖ్యమైన పరిశోధనలు చేస్తుంది. ఒకటి.. చంద్రుడి ఉపరితలం ఎలా ఏర్పడిందో పరిశోధిస్తుంది. రెండోది.. చంద్రుడిపై అయనీకరణ చెందిన వాతావరణం రాత్రి, పగలు సమయాల్లో ఎలా స్పందిస్తుందో పరిశీలిస్తుంది. చంద్రకంపాల (భూకంపాల వంటివి)ను అధ్యయనం చేసే పరికరాలను కూడా పంపాం’ అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.
ఎందుకీ పోరాటం?
భవిష్యత్తులో అంతరిక్షంలో మనుషులు చేపట్టే సుదూర యాత్రలకు చంద్రుడిని ఒక హాల్ట్‌గా వాడుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. అందుకే ధనిక దేశాలు పోటీపడి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. చంద్రుడిపై మనిషి నివసించే పరిస్థితులు ఉంటే స్థిర నివాసం ఏర్పరుచుకోవటం సాధ్యమే. ఆ పరిస్థితి వస్తే అది అతిపెద్ద వ్యాపారం అవుతుంది. ఈ వ్యాపారాన్ని అందిపుచ్చుకొనేందుకు చాలాదేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.