NEET Retest : నీట్-యూజీ రీటెస్టు (NEET UG Retest) ను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశామని ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)’ తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 21న రీటెస్టు ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందని వస్తున్న వదంతులను, సోషల్ మీడియా (Social Media) వేదికగా జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేసింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపింది. మరోవైపు పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే మే 3 నాటి పరీక్షను రద్దు చేశామని, ఈ వ్యవహారం నుంచి పాఠాలు నేర్చుకుని పరీక్షా ప్రక్రియను మరింత బలోపేతం చేశామని ఎన్టీఏ అధికారులు తెలిపారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పటిష్ఠమైన, బహుళ అంచెల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు ‘మానస్’ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి సాయం కోరవచ్చని ఎన్టీఏ సూచించారు.
‘పరీక్షకు ఇప్పటికే సిద్ధమయ్యారు కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టండి. ప్రశాంతంగా ఉండండి. బాగా విశ్రాంతి తీసుకోండి. మీ నుంచి ఇదే కోరుకుంటున్నాం’ అని అభ్యర్థులను ఉద్దేశించి ఎన్టీఏ పేర్కొంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు కూడా విద్యార్థులను ప్రశాంతంగా ఉంచాలని, ధ్రువీకరించని సమాచారాన్ని వారితో షేర్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. వారు స్థిరమైన మనసుతో, నిశ్చింతగా పరీక్షకు వెళ్లేలా చూడాలని సూచించింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 3 నాటి నీట్-యూజీ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.