న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది. ఆయన కస్టడీ గడువు ముగియడంతో మంగళవారం ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ జడ్జి కావేరీ బవేజా సమక్షంలో హాజరుపరిచారు. సీబీఐ సమర్పించిన అనుబంధ చార్జిషీటును విచారణకు స్వీకరించడంపై వాదనలను కోర్టు వింటున్నది.
ఎన్ఎస్జీ చీఫ్‌గా శ్రీనివాసన్ నియామకం
న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్‌గా బీ శ్రీనివాసన్ మంగళవారం నియమితులయ్యారు. ఆయన 1992 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. క్యాబినెట్ నియామకాల కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ఆయన ఈ పదవిని చేపట్టినప్పటి నుంచి పదవీ విరమణ తేదీ 2027 ఆగస్ట్ 31 వరకు ఈ పదవిలో కొlసాగవచ్చు. సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.
విదేశీ విద్యార్థుల సంఖ్యపై ఆస్ట్రేలియా పరిమితులు!
కాన్బెర్రా, ఆగస్టు 27: వలసలను నియంత్రించే క్రమంలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించాలని ఆస్ట్రేలియా భావిస్తున్నది. వచ్చే ఏడాది వీరి సంఖ్యను 2.70 లక్షలకు పరిమితం చేయాలని యోచిస్తున్నది. యూనివర్సిటీల్లో 1.45 లక్షలు, స్కిల్ ట్రైనింగ్ విభాగంలో 95 వేల మంది విదేశీ విద్యార్థులను అనుమతించేలా పరిమితులు విధించనున్నామని ఆస్ట్రేలియా విద్యా మంత్రి జాసన్ క్లేర్ తెలిపారు. దీనిపై యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా చైర్మన్ డేవిడ్ లాయిడ్ అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెప్తూ విశ్వవిద్యాలయాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 6 లక్షల విద్యార్థి వీసాలు మంజూరు కావడం గమనార్హం. కొవిడ్ సమయంలో ఏర్పడిన కార్మికుల కొరతను భర్తీ చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారీగా వలసలను ప్రోత్సహించింది. అయితే గృహ సంక్షోభం వేళ భారీగా వలసలు పెరగడంతో మౌలిక సదుపాయాల కల్పన ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థి, నిపుణుల వలసలను సగానికి తగ్గించాలని ఆస్ట్రేలియా ప్రయత్నిస్తున్నది.