న్యూఢిల్లీ, నవంబర్ 15: జమ్మూ కశ్మీర్లోని నౌగామ్ పోలీసు స్టేషన్లో ప్రమాదవశాత్తు జరిగిన భారీ పేలుడులో 9 మంది మరణించగా మరో 32 మంది గాయపడ్డారని కేంద్ర హోం శాఖ శనివారం తెలిపింది. ఓ ఉగ్ర మాడ్యుల్ నుంచి భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, రసాయనాలను శ్రీనగర్ శివార్లలోని నౌగామ్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలో ఆరు బయట భద్రంగా ఉంచినట్లు ఆయన చెప్పారు. భారీ మొత్తంలో ఉన్న ఈ పదార్థాల తరలింపు గత రెండు రోజులుగా జరుగుతోందని ఆయన తెలిపారు.
అత్యంత సున్నితమైన ఈ పదార్థాలను నిపుణుల పర్యవేక్షణలో తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రక్రియ సందర్భంగా శుక్రవారం రాత్రి 11.20 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందని, 9 మంది ప్రాణాలు కోల్పోగా 27 మంది పోలీసు సిబ్బంది, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ముగ్గురు పౌరులు గాయపడ్డారని సంయుక్త కార్యదర్శి తెలిపారు. పోలీసు స్టేషన్ తీవ్రంగా దెబ్బతిందని, మరి కొన్ని భవనాలకు కూడా నష్టం జరిగిందని లోఖండే చెప్పారు.