Explotion : పటాసుల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు (Explotion) సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కేరళ రాష్ట్రం (Kerala state) త్రిస్సూర్ (Trissur) లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో భీకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాణాసంచా నిల్వ ఉంచిన గోదాములో పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఏకధాటిగా కొన్ని నిమిషాలపాటు బాణాసంచా పేలినట్లు స్థానికులు తెలిపారు.
పేలుడు అనంతరం ఆ ప్రాంతం భీకరంగా మారిపోయింది. చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు సంభవించినప్పుడు దూరం నుంచి తీసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. భీకర పేలుడుతో స్థానికులు వణికిపోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని నివాస గృహాల్లో కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.
త్రిస్సూర్‌లోని ముండతికోడ్ బాణసంచా నిల్వ కేంద్రంలో జరిగిన పేలుడులో గాయపడిన వారికి సరైన వైద్య సేవలు అందేలా చూడాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. వారి చికిత్స నిమిత్తం త్రిస్సూర్ వైద్య కళాశాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా ఆమె సూచించారు. అంతేకాకుండా ఘటనా స్థలానికి తగినన్ని అంబులెన్స్‌లను, వైద్య సిబ్బందిని పంపాలని ఆదేశాలు జారీచేశారు.