హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): తాతాలిక డీజీపీల నియామకం వ్యవహారంలో తెలంగాణ, ఏపీతో పాటు ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తాతాలిక డీజీపీలను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 8న సావిత్రి పాండే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. డీజీపీ పోస్టు ఖాళీ కావడానికి మూడు నెలల ముందే తదుపరి డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుందని సావిత్ర పాండే తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
దేశవాళీ ఆవులు ‘రాజ్యమాత-గోమాత’లు
ముంబై: అసెంబ్లీ ఎన్నికల ముంగిట మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవాళీ ఆవులను ‘రాజ్యమాత-గోమాత’లుగా ప్రకటించింది. వేద కాలం నుంచి వీటికి గొప్ప ప్రాధాన్యం ఉండటం, మానవుల పోషకాహారం, ఆయుర్వేదం, పంచగవ్య చికిత్స, ప్రకృతి సాగు విధానాల్లో ఆవు పాలు, ఎరువుల వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయం, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య శాఖ సోమవారం ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది.