భోపాల్, జూన్ 13: కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఒక విచిత్రమైన కేసని న్యాయ నిపుణులు, మాజీ ఎన్నికల అధికారులు అంటున్నారు. ఎన్నికలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉన్నాయో ఛత్తీస్గఢ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, పలు ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన భగవాన్దేవ్ ఇరానీ దీనిపై మాట్లాడారు. హ్యాండ్ బుక్ అనేది ఒక అలంకారమైన మాన్యువల్ కాదని, నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ ప్రతి దశలో అనుసరించాల్సిన విధానాన్ని వెల్లడించే మార్గదర్శిగా అది ఉంటుందని తెలిపారు. స్వల్ప, సాంకేతిక సమస్యలతో నామినేషన్ పేపర్ తిరస్కరించడంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హ్యాండ్బుక్లోని పేరా 9(1)లో పేర్కొన్నారన్నారు.
ప్రాముఖ్యత లేని లోపం ఆధారంగా ఏ ఒక్క నామినేషన్ను తిరస్కరించ రాదని పేరా 9 (1) నిర్దేశిస్తున్నదన్నారు. కాబట్టి సాంకేతిక, కార్యాలయ పరమైన స్వభావం కలిగిన ఏదైనా పొరపాట్లు, లోపాలను విస్మరించాలని అది వెల్లడిస్తున్నదన్నారు. అలాగే నామినేషన్ స్క్రూటినీలో ప్రధానమైన సూత్రాల్లో ఒకదాన్ని వివరించే పేరా 6(6) ప్రకారం వ్యతిరేకత స్పష్టంగా లేనంత వరకు లేదా నిరూపితం కాని వరకు ప్రతి నామినేషన్ పత్రం చెల్లుబాటు అవుతుందని ఆయన గుర్తు చేశారు.
ప్రయోజనం సంబంధిత అభ్యర్థికే దక్కాలి అని పేర్కొన్న ఇస్రాని.. మీనాక్షి కేసులో అది జరిగినట్టు లేదన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 33ఏ గురించి ఆయన ప్రస్తావిస్తూ వ్యక్తికి రెండేండ్లు అంతకన్నా ఎక్కువ శిక్ష విధించే కేసులో చార్జిషీట్ నమోదైనా, క్రిమినల్ కేసులో శిక్ష పడినా దానిని పొందు పర్చాలన్నారు.