సార్వత్రిక సమరం ముగిసింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. దేశంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని మెజారిటీ సంస్థలు తేల్చాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టాయా? అంటే అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓటర్లు ఈసారి ఎవరికి ఓటు వేశామనే విషయాన్ని బయటపెట్టకుండా గుంభనంగా ఉండటం, ఏజెన్సీల భయాలు కూడా ఎగ్జిట్ పోల్స్‌లో అసలు ప్రజానాడి వెల్లడి కాకపోవడానికి కారణాలని విశ్లేషిస్తున్నారు.
Exit Polls | న్యూఢిల్లీ, జూన్ 1: సార్వత్రిక సమరం ముగిసింది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెలువడ్డాయి. దేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు తేల్చాయి. గత ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లే దాదాపుగా ఈ ఎన్నికల్లోనూ సాధించవచ్చని అంచనా వేశాయి. ఇండియా కూటమి 150 సీట్లకు అటూఇటుగా వచ్చి ఆగిపోవచ్చని జోస్యం చెప్పాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టాయా? ప్రజానాడిని గుర్తించాయా? అంటే అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలకు ముందు నుంచి ఈసారి ఎన్డీయే భారీ విజయం సాధించబోతున్నదని బీజేపీ సృష్టించిన హైప్లో ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు కూడా చిక్కుకున్నాయని భావిస్తున్నారు. ఓటర్లు అనేకరకాల కారణాలతో ఈసారి ఎవరికి ఓటు వేశామనే విషయాన్ని బయటపెట్టకుండా గుంభనంగా ఉండటం, ఏజెన్సీల భయాలు కూడా అసలు ప్రజానాడి ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడి కాకపోవడానికి కారణాలని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన అంచనాలే ప్రజాభిప్రాయమైతే.. మూడో దశ పోలింగ్ తర్వాత బీజేపీ నేతల్లో ఎందుకు ఆందోళన మొదలైందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మూడో దశ తర్వాత బీజేపీ నేతలు మతపరమైన అంశాలను తెరమీదకు తెచ్చి ప్రజల్లో ఉద్వేగం పెంచే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఒకవైపు యోగేంద్ర యాదవ్ వంటి సీనియర్ సెఫాలజిస్టులు, ప్రశాంత్ భూషణ్ లాంటి ప్రముఖులు సైతం ఈసారి బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని చెప్తుండగా, ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇందుకు విరుద్ధంగా చెప్పడం గమనార్హం.
ఎగ్జిట్ పోల్స్‌ను ఇండియా కూటమి నేతలు సైతం కొట్టిపారేస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని జూన్ 4న తప్పవుతాయని, మూడోసారి మోదీ ప్రధాని అయితే తాను గుండు గీయించుకుంటానని ఆప్ నేత సోమ్‌నాథ్ భారతి సవాల్ విసిరారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సైతం కొట్టిపారేశారు. న్యూస్ ఛానళ్లు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా సీట్ల సంఖ్యను పెంచేశాయని, తద్వారా అధికారులపై ఒత్తిడి పెంచాయని ఆయన ఆరోపించారు. ఇండియా కూటమి కచ్చితంగా 295కు పైగా సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా అశాస్త్రీయమైనవని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేర్కొన్నారు. గత ఏడాది ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తప్పు అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాము అసలైన ఓట్లు ఏం చెప్తాయనేది చూడటానికి సంతోషంగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా మోదీ ఆడిస్తున్న మానసిక ఆటలని, అసలు ఫలితాలు చాలా భిన్నంగా ఉంటాయని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.