Samrat Choudhary : బిహార్‌లో కొన్నేళ్లుగా మద్యపాన నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే,ఇప్పుడు మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి స్పందించారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయబోమని స్పష్టం చేశారు. గతంలో బిహార్ సీఎంగా ఉన్న నితీష్ కుమార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల మద్యాన్ని నిషేధించారు. అయితే, ఇప్పుడు బిహార్‌లో అధికారం మారిన సంగతి తెలిసిందే.
నితీష్ స్థానంలో సామ్రాట్ చౌదరి సీఎం అయ్యారు. ఆయన సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తారని, లిక్కర్‌కు తిరిగి అనుమతులు ఇస్తారని ప్రచారం మొదలైంది. అయితే, ఈ అంశంపై తాజాగా సీఎం సామ్రాట్ చౌదరి స్పందించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపానంపై నిషేధాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిషేధాన్ని ఎత్తివేయబోమన్నారు. మద్యపాన నిషేధం అమలైనప్పటినుంచి రాష్ట్రంలోని సగం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో క్రైమ్ రేటు కూడా తగ్గిందన్నారు. ఇటీవల బకీంపూర్‌లో బీజేపీ ఓడిపోవడంపై కూడా సీఎం మాట్లాడారు. ప్రజల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై కూడా సామ్రాట్ చౌదరి వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఒక్కటి రుజువు చేసినా రాజకీయాల నుంచి తప్పుకొంటాను అన్నారు. 2030 వరకు తమకు అధికారం ఉందని, ఆలోపు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు రాష్ట్ర యువత ఆకాంక్షల్ని తమ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందన్నారు. ప్రధాని మోదీ, మాజీ సీఎం నితీష్ కుమార్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామన్నారు.