PM Modi | హైదరాబాద్, ఏప్రిల్ 7 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినా ఆ ప్రయోజనాలు సామాన్యుడికి దక్కకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో గిమ్మిక్కు పాల్పడింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ. 2 చొప్పున పెంచుతున్నట్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి ఈ పెంపు వర్తిస్తుందని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడు పెట్రో వాత పెట్టిన ఎన్డీయే సర్కారు.. ధరలు తగ్గినప్పుడు మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించట్లేదు. దీంతో సామాన్యులకు అందాల్సిన ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి.
వివరంగా చెప్పాలంటే.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే, దేశీయం గా పెట్రో ధరలు తగ్గాలి. కానీ కేంద్రం ఎక్సైజ్ సుంకాల పేరిట సవరణలు చేస్తూ ఇంధన ధరలను తగ్గించడం లేదు. దీని కోసం ఎక్సైజ్ డ్యూటీ పేరిట అదనపు సుంకాలను విధిస్తున్నది. గడిచిన పదకొండేండ్లలో కేంద్రం పెట్రోల్‌పై 37.13 శాతం ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, డీజిల్‌పై ఏకంగా 180.89 శాతం పన్ను పెంచింది. ఈ మేరకు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) గణాంకాలు చెప్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ, అదనపు సంకాలను పెంచుతూ ఆ ప్రయోజనాలను సామాన్యులకు దక్కకుండా మోదీ సర్కారు వ్యవహరించడం తెలిసిందే.
2014లో మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పదకొండేండ్ల వ్యవధిలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 51.35 శాతం, 74 శాతం మేర పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ముడి చమురు ధర నాలుగేండ్ల కనిష్ఠానికి చేరినప్పటికీ, దేశీయంగా ఇంధన ధరలను మాత్రం తగ్గించని కేంద్రంలోని ఎన్డీయే సర్కారు పెట్రోవాతకు తెగబడింది. అంతర్జాతీయ విపణిలో ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 65 డాలర్లకు దిగువకు చేరింది. అయినప్పటికీ, దేశీయంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46, డీజిల్ ధర రూ. 95.70గానే ఉన్నది. దీంతో కేంద్ర సర్కారు వైఖరిపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.