న్యూఢిల్లీ, ఆగస్టు 3: రాత్రి సమయంలో తక్కువ నిద్ర అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందన్నది మనకు తెలిసిందే! అయితే.. అంతకు మించిన ఆరోగ్య సమస్యలు రాత్రిపూట 9 గంటలకు మించిన అధిక నిద్రతో ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. అధిక నిద్ర వల్ల గుండె సమస్యలు, డిప్రెషన్, అధిక బరువు, టైప్-2 డయాబెటిస్, రోగ నిరోధక శక్తి దెబ్బతినటం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తి, మరణించే ముప్పును అధికం చేస్తాయని పరిశోధకులు తేల్చారు. ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ జర్నల్ కథనం ప్రకారం, పరిశోధకులు 79 సుదీర్ఘమైన అధ్యయనాల్ని విశ్లేషించారు.
రాత్రిపూట ఏడు గంటల కన్నా తక్కువ సమయం నిద్ర పోయేవాళ్లకు 14 శాతం మరణించే ముప్పు ఉందని తేలగా, 9 గంటలకు మించి నిద్రపోయేవాళ్లలో మరణించే ముప్పు 34 శాతం ఉంటుందని అధ్యయనం పేర్కొన్నది. ప్రతి రోజూ అధిక నిద్ర (9 గంటలకు మించి) కలిగిన వాళ్లలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నది గత అధ్యయనాల్లోనూ బయటపడిందని పరిశోధకులు తెలిపారు. గత అధ్యయనాల ‘డాటా’ను విశ్లేషించగా, అన్ని వయస్సుల వారిలో ఒకే విధమైన నిద్ర తీరు ఉండదని, టీనేజర్లకు 8 నుంచి 10 గంటల నిద్ర అవసరమవుతుందని, అదే పెద్దవాళ్లకు 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుందన్న సంగతి గుర్తించారు.