CBSE : ఈ సంవత్సరం తొలిసారిగా సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి సమాధాన పత్రాలను డిజిటల్ మూల్యాంకనం (Digital Evaluation) చేస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ మూల్యాంకన ప్రక్రియలో సాంకేతిక లోపం (Technical issue) తలెత్తిందని, దాంతో మూల్యాంకనం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సాంకేతిక లోపం తలెత్తడంతో మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది.
తాము ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో మూల్యాంకన ప్రక్రియ సజావుగా జరుగుతోందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ అంశంపై సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ పీటీఐతో మాట్లాడారు. మే మూడో వారం నాటికి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో సాంకేతిక లోపాలను ఎత్తిచూపుతూ వచ్చిన మీడియా కథనం వాస్తవదూరంగా ఉందన్నారు. ఎవాల్యుయేషన్ ప్రక్రియ గతంలో కన్నా అద్భుతంగా జరుగుతోందని తెలిపారు.
ఈ విధానంపై టీచర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, తమకు సెల్ఫీలు, ఫొటోగ్రాఫ్‌లు, మెసేజ్‌లు పంపుతూ కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఎవాల్యుయేషన్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని, ఫలితాలను మే మూడో వారం నాటికి విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఈ విద్యా సంవత్సరం నుంచి బోర్డు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 12వ తరగతి సమాధాన పత్రాలను సంప్రదాయ పద్ధతిలో కాకుండా.. తొలిసారిగా ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ విధానంలో డిజిటల్‌గా మూల్యాంకనం చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఫలితాల ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా పారదర్శకత పెరుగుతుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.