పాట్నా: రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సూరాజ్ పార్టీలో మాజీ కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్ (RCP Singh) ఆదివారం చేరారు. బీహార్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి తామిద్దరం కలిసి పని చేస్తామని ఆయన అన్నారు. తన ‘ఆప్ సబ్ కీ ఆవాజ్’ పార్టీని జన్ సూరాజ్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్వస్థలం నలందకు చెందిన ఆర్సీపీ సింగ్, ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. 1999లో నితీశ్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర డిప్యుటేషన్‌పై ఉన్న ఆర్పీసీ సింగ్ ఆయనకు పరిచయమయ్యారు. ఆర్సీపీ సింగ్ పరిపాలనా చతురత నితీశ్ కుమార్‌ను ఆకట్టుకున్నది.
కాగా, 2005లో బీహార్ సీఎంగా అధికారం చేపట్టిన నితీశ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రానికి రావాలని ఆర్సీపీ సింగ్‌ను ఒప్పించారు. 2010లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన జేడీ(యూ)లో చేరారు. ఆ తర్వాత ఆర్సీపీ సింగ్ వరుసగా రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు.
మరోవైపు 2021లో కేంద్ర మంత్రివర్గంలోకి ఆర్సీపీ సింగ్ చేరారు. అయితే నితీశ్ కుమార్‌కు ఇది నచ్చలేదు. ఈ నేపథ్యంలో జేడీ(యూ) జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. అలాగే మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసేందుకు జేడీ(యూ) నిరాకరించింది.
కాగా, 2023లో జేడీ(యూ)ను వీడిన ఆర్సీపీ సింగ్ బీజేపీలో చేరారు. అయితే అక్కడ ఆయన ఇమడలేకపోయారు. ఈ నేపథ్యంలో 2024 నవంబర్‌లో సొంత పార్టీ ‘ఆప్ సబ్ కీ ఆవాజ్’ను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సూరాజ్ పార్టీలో ఆర్సీపీ సింగ్ చేరారు. అలాగే తన పార్టీని కూడా అందులో విలీనం చేశారు.