Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. ఆర్థిక సంస్కరణల సూత్రధారి, యూపీఏ కూటమికి ప్రధానిగా 2004-14 మధ్య పని చేశారు. 1991లో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానకు తరలించారు. ఆయనకు తీవ్ర అస్వస్థతతో ఉండటంతో ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స అందించారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియాగాంధీ, వాయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ హుటాహుటిన ఎయిమ్స్ దవాఖానకు చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ.. మన్మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఎయిమ్స్ దవాఖానకు ప్రముఖులు రానున్న నేపథ్యంలో పోలీసు భద్రత పెంచారు. కర్ణాటకలోని బెల్గాం పర్యటనలో ఉన్న లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు.