రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ (Champai Soren) మళ్లీ మంత్రి అయ్యారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. చంపై సోరెన్‌తోపాటు మరో పది మంది నేతలతో మంత్రులుగా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం హేమంత్ సోరెన్‌తో సహా 12 మంది సభ్యుల కేబినెట్లో కొత్త వారికి చోటు దక్కింది. కాంగ్రెస్‌కు చెందిన జమ్తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ, మహాగామా ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్, జేఎంఎంకు చెందిన లతేహర్ ఎమ్మెల్యే బైదినాథ్ రామ్ మంత్రులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, కాంగ్రెస్‌కు చెందిన రామేశ్వర్ ఒరాన్, బన్నా గుప్తాతో పాటు, జేఎంఎంకు చెందిన మిథిలేష్ కుమార్ ఠాకూర్, హఫీజుల్ హసన్, దీపక్ బిరువా, బేబీ దేవి, ఆర్జేడీకి చెందిన సత్యానంద్ భోక్తా తమ మంత్రి పదవులను నిలుపుకున్నారు.
మరోవైపు సోమవారం ఉదయం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను హేమంత్ సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. అయితే ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.